హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తరచూ చర్చకు వచ్చే బీఆర్ఎస్, బీజేపీ పొత్తుల అంశంపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో ఏ ఎన్నికలైనా సరే బీఆర్ఎస్తో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని ఆయన తేల్చిచెప్పేశారు. భవిష్యత్తులోనూ తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి బదులిస్తూ.. "తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉంటుందని ఎవరు చెప్పారు? అలాంటి పొత్తులను ఎవరూ కోరుకోవడం లేదు. బీజేపీ తన సిద్ధాంతాలకనుగుణంగానే స్వతంత్రంగా రాజకీయాలు చేస్తోంది" అని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మొదట కేటీఆర్ తన చెల్లెలు కవితను కలవమనండి.. ఆ తర్వాతే వేరే పొత్తుల గురించి మాట్లాడవచ్చు" అంటూ ఎద్దేవా చేశారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి అజెండాగా సాగే పార్టీలతో పొత్తు ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.


