హైదరాబాద్: ఓట్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికల కమిషన్‌ను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గురువారం హిమాయత్‌నగర్ డివిజన్‌లో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల కమిషన్ (EC) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్ల తొలగింపు అంశంలో ఎన్నికల కమిషన్ తన వైఖరిని తక్షణమే మార్చుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఈసీ తన పద్ధతిని మార్చుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం మొత్తం తగలబడిపోతుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి కుమ్మక్కై పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

20 వేల ఓట్ల తొలగింపు..

కేవలం హిమాయత్‌నగర్ డివిజన్‌లోనే కుట్రపూరితంగా దాదాపు 20 వేల వరకు ఓట్లను తొలగించారని దానం ఆరోపించారు. ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు 'ఓట్ చోరీ'కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క పేదవాడి ఓటును కాపాడుకునే పూర్తి బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని దానం నాగేందర్ హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 1 Oct 2026 | 06:10 PM IST
Tags: