ఇబ్రహీంపట్నం: సమాజ నిర్మాణంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు.. మారుతున్న కాలంలో విద్యార్థులను చెడు పోకడల నుంచి సన్మార్గం వైపు నడిపించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శేరిగూడ సమీపంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఉపాధ్యాయ లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలో ఎంతటి అత్యున్నత స్థాయిలో ఉన్న వారి వెనకైనా ఒక గురువు శ్రమ ఉంటుందని మల్రెడ్డి రంగారెడ్డి కొనియాడారు. సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించేందుకు అహర్నిశలు శ్రమించే ఉపాధ్యాయులు ప్రస్తుత పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్ లాంటి ప్రమాదకర భూతాల బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకు కేవలం పోలీసులే కాకుండా, ఉపాధ్యాయులు సైతం చొరవ తీసుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భావిభారత పౌరుల భవితకు బంగారుబాటలు వేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీఎల్బీ కిరణ్మయి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


