ఇబ్రహీంపట్నం: శ్మశానంలాంటి ప్రభుత్వాస్పత్రి, నిర్లక్ష్యపు పాలకుల కారణంగానే గతం ఇబ్రహీంపట్నంలో ఎనిమిది మంది బాలింతలు ఒకేరోజు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఘోరాన్ని నిరసిస్తూ తాను ఇబ్రహీంపట్నం నడిరోడ్డుపై కూర్చుని ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటిప్రకారం, శిథిలమైన భవనాన్ని కూల్చివేసి కార్పొరేట్ హంగులతో నూతన ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్యులతో మాట్లాడిన ఆయన పనుల పురోగతి, సౌకర్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత మరియు డిప్యూటేషన్పై వెళ్లిన వైద్యులంతా తిరిగి వచ్చాక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. గతంలో రోజుకు యాభై మంది వరకు వచ్చే రోగుల సంఖ్య, ప్రస్తుతం 500 మందికి చేరినట్లు వైద్యులు వివరించారు. తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పరిస్థితులను సమీక్షించిన ఆయన, వీలైనంత త్వరగా ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
నిత్యం వందలాది మంది ఇబ్రహీంపట్నం నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తూ రోజుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేసిన ఎమ్మెల్యే.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరీక్షల నుంచి చికిత్స, మందులు అన్నీ అందేలా ప్రభుత్వాస్పత్రిని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కాస్త ఆలస్యమైనా సరే అద్భుతమైన రీతిలో యశోద, అపోలో తరహాలో సౌకర్యాలు కల్పించాలనేదే తన ధ్యేయమన్నారు. అప్పటివరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సచివాలయంలో సమీక్ష జరిపి, డిప్యూటేషన్పై వెళ్లిన వారందరినీ వెనక్కి రప్పించినట్లు మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి పేదప్రజలందరికీ నాణ్యమైన వైద్యసేవలను అందిస్తామని, అవసరమైతే మరో యాభై మంది డాక్టర్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సుస్తీ చేసిన వారందరూ ఇకపై నేరుగా సర్కార్ దవాఖానాకే వెళ్లేలా పరిస్థితులు రావాలని ఆయన ఆకాంక్షించారు.


