మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. కారు, అంబులెన్స్ సహా మొత్తం నాలుగు వాహనాలను ఒకేసారి ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో సహాయం చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఓ వ్యక్తి వారికి సహాయంగా నిలిచాడు. అందరూ కలిసి క్షతగాత్రుడిని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సమయలో అదే మార్గంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పింది.
అంబులెన్స్తో పాటు అక్కడున్న నాలుగు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంలో అంబులెన్స్ సిబ్బందికి సహాయం చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా లేక బ్రేకులు ఫెయిల్ కావడం తదితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


