కొత్తూరు: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శనివారం కొత్తూరు మున్సిపాలిటీ కార్యాలయంలో కొత్తూరు మండల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడం వల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, గల్లీ గల్లీలో దళారులు ఆటోల్లో వచ్చి పేదల వద్ద బియ్యం కొనుగోలు చేసి, రైస్ మిల్లర్ల ద్వారా పాలిష్ చేయించి తిరిగి మార్కెట్లో అమ్ముకున్నారని విమర్శించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం, పారదర్శకమైన రీతిలో సంక్షేమ పథకాలను అందించడమే తమ ధ్యేయమని, ఇప్పటివరకు కార్డులు రాని ఇతర అర్హులందరికీ కూడా త్వరలోనే అందజేస్తామని ఆయన భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొత్తూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నందిగామ మండల అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్, నాయకులు నర్సప్పగూడ క్రిష్ణ, అగీర్ రవికుమార్ గుప్తా, తహసీల్దార్ మసూద బేగం, మున్సిపల్ కమిషనర్ సాహితీ రెడ్డి, సర్పంచులు దయానంద్, శ్రీరాములు, గోవిందు, విష్ణు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


