కేశంపేట్: రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని సంతాపూర్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు శనివారం సర్పంచ్ బార్కం యాదయ్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ జాతరను అన్ని పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి ఐక్యతతో ఘనంగా నిర్వహించడం విశేషం.

పురాతన చరిత్ర ప్రకారం గ్రామానికి చెందిన పానకాల రాయుడు అనే భక్తుడు ప్రతి ఏటా విజయవాడ సమీపంలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకునేవాడు. అనారోగ్యంతో వెళ్లలేని పరిస్థితిలో స్వామివారు పంతులు రూపంలో కలలో కనిపించి "ఇక్కడి దట్టమైన అడవిలో కొండపై నేను స్వయంభూగా వెలిశాను" అని చెప్పారని, మరుసటి రోజు స్థానిక పెద్దలతో వెళ్లి చూడగా స్వామివారి నిజరూప దర్శనం లభించిందని స్థానికులు తెలిపారు. నాటి నుండి ప్రతి శ్రావణ మాస చివరి శనివారం నాడు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది వేడుకలను దేవాదాయ శాఖ కమిటీ మెంబర్ లకాకుల రాజు, గ్రామ పెద్దలు అంజయ్య, యువత, గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించారు. సంతాపూర్ తో పాటు కేశంపేట్ మండలంలోని 24 గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హనుమంతునికి సిందూరాభిషేకాలు, రథోత్సవం నిర్వహించారు.

ఆలయం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో రాత్రి వేళల్లో విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నామని, భక్తుల సౌకర్యార్థం లైటింగ్, రహదారి రాతిబాటగా ఉండటంతో రోడ్డు సౌకర్యం, నిత్య పూజల కోసం శాశ్వత పూజారిని కేటాయించి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని ఆలయ కమిటీ సభ్యులు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బార్కం యాదయ్య, కమిటీ సభ్యులు లక్కాకుల రాజు, వార్డ్ నెంబర్లు సాజిద్, సరిత, శ్రీరాములు, కిరణ్, పరమేశ్వరి, ఎద్దు సరిత, ఎద్దు జయమ్మ, సాకలి అశోక్, గ్రామ పెద్దలు కరీంమ్లా అంజయ్య, కరెడ్ల శివారెడ్డి, కుమ్మరి బాలరాజు, గాండ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 5 Sept 2026 | 10:27 PM IST
Tags: