ఆమనగల్లు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హత కలిగిన ఏ ఒక్క పేద కుటుంబం సంక్షేమ ఫలాలకు దూరం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పేద వర్గాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలను అధికారులు నిర్దేశిత సమయంలో వేగంగా అందించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్‌రెడ్డి, గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహా, మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, డైరెక్టర్ శ్రీశైలం, ఖాదర్ ఖాద్రీ, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


