అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వ భూములు, పేదల స్థలాలు వేటిని వదలకుండా పదేళ్లపాటు దోచుకుతిన్న కబ్జాకోరులు మళ్లీ ఏం ముఖం పెట్టుకుని రోడ్డెక్కుతున్నారని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. పేదోడి నోటికాడ ముద్దలాక్కుని తినేవాడికి పేదప్రజల కష్టాలేం తెలుస్తాయని మండిపడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను అందజేశారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న వారు పేదప్రజలకు రేషన్‌కార్డులు, ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటులాంటి పథకాలను ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే నిలదీశారు. ప్రజలు మెచ్చి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వమే నిజంగా పేదల గురించి ఆలోచిస్తోందని, ఎంగిలి మెతుకులకు ఆశపడే వారు తమ పార్టీలో ఉండరని స్పష్టం చేశారు. పదేళ్ల వారి పాలనకు, తమ రెండున్నరేళ్ల పాలనకు మధ్య జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రావాలని, తమ పార్టీ కార్యకర్తలే వాటికి సమాధానం చెబుతారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మరల్చేలా బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటి వారిపై తాను దృష్టి సారిస్తే రోడ్డుపై కూడా తిరగలేరని హెచ్చరించారు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే తోలు తీస్తానని మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించే బాధ్యత తనదని, ఇంటిస్థలం లేని వారికి కూడా గృహసౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రేషన్దుకాణాలే పేద ప్రజల సంక్షేమ పథకాలకు కేంద్రాలని, అవసరమైన చోట మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూధన్‌రెడ్డి, బాటసింగారం రైతు సహకార బ్యాంకు ఛైర్మన్ జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ భాస్కరాచారి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జక్క రవీందర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్ విజయాశ్రీశైలం, కవాడిపల్లి సర్పంచ్ లక్ష్మీప్రసన్నరవీందర్రెడ్డి, జాఫర్‌గూడ సర్పంచ్ వెంకటేశ్గూడ, లష్కర్‌గూడ సర్పంచ్ ఐలయ్యయాదవ్, మాజీ జడ్పీటీసీ దాసుగౌడ్, పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


