అల్వాల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యపట్ల కన్నతండ్రే రాక్షసుడిగా మారి ఆరు నెలల గర్భిణీ అయిన ప్రాణాన్ని బలిగొన్నాడు. మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా నిండు ప్రాణాన్ని తీసే వరకు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పరిధిలోని సూర్యనగర్‌కు చెందిన పరశురామ్ ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం ఆయనకు శివాని (యువతి)తో వివాహం జరిగింది. కాగా, ఆదివారం రాత్రి పరశురామ్ విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన పరశురామ్ విచక్షణ కోల్పోయి ఆరు నెలల గర్భిణీ అయిన శివాని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.

ఈ దారుణానికి పాల్పడిన అనంతరం పోలీసుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి తప్పించుకునేందుకు అతడు ప్లాన్ చేశాడు. భార్య బాత్రూంలో కాలు జారిపడి తీవ్రంగా గాయపడిందని, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, భర్త పరశురామ్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. మద్యం మత్తులో తానే గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు పరశురామ్ అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Sept 2026 | 05:15 PM IST
Tags: