శంషాబాద్:
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పరిధిలోని కిషన్గూడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని కరీంనగర్ వాసి అజ్మల్గా గుర్తించారు. హోటల్ వద్ద టీ తాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 50 మందికిపైగా స్వల్పగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. బస్సు దూసుకెళ్లే ముందు ఒక కంటైనర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ కంటైనర్ను తప్పించే క్రమంలోనే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పలు వాహనాలను ఢీకొడుతూ బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లింది. హోటల్లో వంట చేస్తుండగా (బొండాలు వేస్తుండగా) ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలవగా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


