శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. ఖతార్‌లోని దోహా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఒక భారతీయ ప్రయాణికుడు తన సామానులో నిషేధిత కొకైన్‌ను అక్రమంగా తరలిస్తున్నాడనే పక్కా నిఘా సమాచారం డీఆర్ఐ అధికారులకు అందింది. ఈ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆ ప్రయాణికుడిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
చాక్లెట్ ట్యూబ్లలో గుట్టుచప్పుడు కాకుండా..
అరెస్ట్ చేసిన ప్రయాణికుడి క్యాబిన్ బ్యాగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఏడు 'లిండ్ట్ లిండర్ అసార్టెడ్ ఫిల్డ్ డార్క్ చాక్లెట్ సెలక్షన్' ట్యూబ్‌లను పరిశీలించగా, వాటిపై ఉన్న బరువు కంటే అవి అసాధారణంగా బరువుగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వాటిని తెరిచి పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఏడు ట్యూబ్‌ల లోపల చాక్లెట్లతో పాటు అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 207 లేత-పసుపు రంగు అండాకారపు క్యాప్సూల్స్ లభించాయి.
నార్కోటిక్ టెస్ట్‌లో నిర్ధారణ..
సదరు క్యాప్సూల్స్‌లో ఉన్న పొడి పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ఉపయోగించి పరీక్షించగా, అది కొకైన్ అని స్పష్టమైంది. అక్రమ మార్కెట్లో సుమారు రూ. 24.5 కోట్ల విలువ చేసే మొత్తం 4.9 కిలోల (స్థూల బరువు) కొకైన్‌ను ప్రయాణికుడి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ విలువ కలిగిన ఈ భారీ మొత్తపు డ్రగ్స్‌ను జప్తు చేసిన డీఆర్ఐ అధికారులు, ఎన్డీపీఎస్ (NDPS) చట్టం, 1985 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో అధికారులు తదుపరి దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.


