కడ్తాల్: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో సర్పంచ్ గోపాల్ అధ్యక్షతన 'జలసరి' కార్యక్రమంపై ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ గ్రామంలో మాట్లాడుతూ.. వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని తెలిపారు. వర్షపు నీరు ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అందుకు అనుగుణంగా ప్రతి ఇంటింటికీ ఇంకుడుగుంతతో పాటు కమ్యూనిటీ ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరవుతాయని గ్రామస్తులకు వివరించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే వివిధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఇంటి పరిసరాలలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చూడాలని, నిలకడగా ఉండే నీటిలో దోమలు ఆవాసం ఏర్పరచుకుని వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని, ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
ఈ గ్రామసభలో వార్డు సభ్యులు రవికుమార్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ యాదవ్, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, పాండు, రమేష్, రాములు యాదవ్, రాఘవులు, సాయికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్, అగ్రికల్చర్ ఈవో వందన, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, మిషన్ భగీరథ సిబ్బంది శివలింగం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


