షాద్నగర్: భారతీయ జనతా పార్టీని బలహీనపరిచేందుకు కొంతమంది ప్రత్యర్థి రాజకీయ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని బీజేపీ షాద్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారంటూ కొన్ని మీడియా వేదికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టంగా ఖండించారు. తనపై రాష్ట్ర అధ్యక్షుడికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలలో అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎప్పుడూ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీలో ఏవైనా అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు తలెత్తితే వాటిని అంతర్గత వ్యవస్థలోనే పరిష్కరించుకునే చక్కటి సంప్రదాయం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఎనిమిది రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజయవంతంగా తీసుకెళ్లామని చెప్పారు. ఎంపీ డికే అరుణ దిశానిర్దేశంలో పార్టీ నాయకులు స్వయంగా ఢిల్లీ వరకు వెళ్లి సమస్య పరిష్కారం కోసం గట్టిగా పోరాడారని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, 22-A భూముల సమస్యలతో పాటు నియోజకవర్గంలోని సమస్త ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం శ్రమిస్తోందన్నారు.
ప్రజా సమస్యలపై బీజేపీ చేపడుతున్న పోరాటాలకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేకనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. “బీజేపీ నాయకులు, కార్యకర్తలందరం ఐక్యంగా, పూర్తి క్రమశిక్షణతో ప్రజల పక్షాన పోరాడుతున్నాం. తప్పుడు ప్రచారాలతో కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా సాధ్యం కాదు” అని తేల్చిచెప్పారు. వార్తలను ప్రచురించే లేదా ప్రసారం చేసే ముందు మీడియా ప్రతినిధులు సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవాలను నిర్ధారించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం.. ప్రజల పక్షాన పోరాటమే మా మార్గం” అని విష్ణువర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు.


