వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలి హిల్స్ నివాసి అయిన సామ రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరో పెద్ద బాధ్యతను అందుకోనున్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, న్యాయవాదిగా ప్రజా సమస్యలపై న్యాయపోరాటం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వేలాది టీవీ చర్చల్లో పార్టీ వాణిని గట్టిగా వినిపించిన నేత ఆయన. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. సాధారణ విద్యార్థి నేత స్థాయి నుంచి నేడు శాసనమండలి ఎన్నికల బరి వరకు సాగిన ఆయన రాజకీయ ప్రయాణం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్ఎస్‌యూఐ నుంచి మీడియా చైర్మన్ వరకు..

1988 జూన్ 9న జన్మించిన సామ రామ్మోహన్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై తీవ్ర ఆసక్తి కనబరిచారు. 2003లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI)తో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మౌలిక వసతులపై ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసి ప్రజా సమస్యలపై న్యాయపోరాటం చేశారు. రాజకీయాలతో పాటు న్యాయపరమైన అవగాహనను తన ప్రజా జీవితంలో జోడించారు.

ఐదు వేలకు పైగా టీవీ డిబేట్లు.. ఎన్నికల వార్‌రూమ్‌లలో కీలక పాత్ర..

రాష్ట్ర రాజకీయాల్లో సామ రామ్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణం ఆయన మీడియా ప్రెజెన్స్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దాదాపు 5,000కు పైగా టెలివిజన్ చర్చల్లో పాల్గొని, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పార్టీ వాదనను ధీటుగా వినిపించారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నిర్వహించిన వార్‌రూమ్ కార్యకలాపాల్లో మీడియా సమన్వయం, కమ్యూనికేషన్ వ్యూహాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన ప్రతిభను గుర్తించిన పార్టీ హైకమాండ్ 2019లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, 2024లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా నియమించింది.

స్థానిక అనుబంధం నుంచి శాసనమండలి పోరుకు..

వనస్థలిపురం వనస్థలి హిల్స్ కేంద్రంగా స్థానిక ప్రజలతో నిరంతరం మమేకమయ్యే రామ్మోహన్ రెడ్డి, 2020 GHMC ఎన్నికల్లో వనస్థలిపురం డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు. స్థానిక రాజకీయాలతో పాటు రాష్ట్రస్థాయిలో పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను నడిపించిన ఆయనకు, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో అత్యున్నత రాజకీయ అవకాశం దక్కింది. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడిగా పేరున్న ఆయన అభ్యర్థిత్వం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థి దశ నుంచి నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నేత.. పట్టభద్రుల గొంతుకగా శాసనమండలి రేసులోకి ప్రవేశించడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Sept 2026 | 06:14 PM IST
Tags: