ఢిల్లీ: దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 'పీఎమ్ ధార' (PM DHARA) పథకానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 1,86,405 కోట్ల భారీ నిధులను కేటాయించింది. సోలార్ లేదా విండ్ ప్లాంట్లు సాధారణంగా నగరాలకు దూరంగా ఎడారులు లేదా మైదాన ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ తయారైన విద్యుత్‌ను అక్కడే ఉంచలేమని, దాన్ని ప్రజల ఇళ్లకు, పరిశ్రమలకు చేర్చాలంటే భారీ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్-స్టేషన్లు, గ్రిడ్ వ్యవస్థ కావాలని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌లోకి సురక్షితంగా తరలించడాన్ని 'పవర్ ఎవాక్యుయేషన్' అంటారు. ఇందుకోసం భారీ విద్యుత్ లైన్లు, గ్రిడ్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను దేశవ్యాప్తంగా నిర్మించడానికి కేంద్రం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.
వ్యవసాయం, పట్టణ రవాణా రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర మంత్రి మండలి రూ. 2,79,157 కోట్ల విలువైన మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కి గానూ ఆరు ప్రధాన రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దేశంలోని రైతులకు దాదాపు రూ. 90,962 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. పంటల వారీగా ప్రకటించిన కొత్త మద్దతు ధరలను పరిశీలిస్తే.. గోధుమలు క్వింటాలుకు రూ. 2,610 (గతంలో రూ. 2,585 ఉండగా రూ. 25 పెంపు), బార్లీ రూ. 2,286 (రూ. 136 పెంపు), శనగలు రూ. 5,958 (రూ. 83 పెంపు), మసూర్ పప్పు రూ. 7,390 (రూ. 390 పెంపు), ఆవాలు లేదా రైప్ సీడ్ రూ. 6,613 (రూ. 413 పెంపు), కుసుమలు రూ. 7,215 (అత్యధికంగా రూ. 675 పెంపు) చొప్పున ఖరారు చేశారు. తృణధాన్యాల కంటే నూనెగింజలు, పప్పుధాన్యాలకు ఎక్కువ మద్దతు ధరలు ప్రకటించి రైతులను పంట మార్పిడి వైపు ప్రోత్సహించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక దేశంలో పునరుత్పాదక ఇంధన వ్యాప్తిని వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన 'పీఎమ్ ధార' (Developing Harmonized and Accelerated Renewable Energy Access) పథకం ద్వారా గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC-III) ద్వారా 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు అనుసంధానించనున్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు రాకుండా 50 GWh సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇవేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) కోసం రూ. 1,790 కోట్లు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు స్మార్ట్ సిగ్నల్స్ సాంకేతికత ద్వారా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రవాణా రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతను మరింత పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.


