తలకొండపల్లి: పడకల్, లింగరావుపల్లి, రామకృష్ణపురం, దేవునిపడకల్, పెద్దూర్ తండా, వెంకటాపూర్ తండా గ్రామపంచాయతీలకు సంబంధించిన పడకల్ విద్యుత్తు ఉప కేంద్రానికి ఆల్వాల్ 132 కేవీ విద్యుత్తు కేంద్రం నుంచి సరఫరా అవుతోందని తలకొండపల్లి సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి విన్నవించారు. లోడు ఎక్కువ కావడంతో తరచుగా ట్రిప్ అవుతోందని, దీంతో సక్రమంగా విద్యుత్తు సరఫరా కావడం లేదని తెలిపారు. చేతికొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొంటూ, పడకల్ సబ్ స్టేషన్కు ఆల్వాల్ నుంచి వచ్చే ఫిడర్కు లోడు తగ్గించి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
అలాగే సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి గట్ల కేశవ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీసీఐ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో మొదట పత్తి తీస్తున్న రైతులు దసరా ఖర్చుల కోసం దళారులను ఆశ్రయించి తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతులను ఆదుకునేందుకు సీసీఐ కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా ముదిరాజ్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, కాకి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


