కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికురాలు బ్యాగరి పెంటమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ అభివృద్ధిలో, పారిశుధ్య నిర్వహణలో నిత్యం శ్రమించిన పెంటమ్మ మృతి గ్రామంలో విషాదం నింపింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ శుక్రవారం స్వయంగా ఆమె నివాసానికి వెళ్లారు.

పెంటమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్యపడవద్దని, గ్రామపంచాయతీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున పెంటమ్మ అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రావిచేడ్ ఉపసర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు రవికుమార్, అనిల్, భూపతి, సరిత, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్, గ్రామ ప్రముఖులు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 06:18 PM IST
Tags: