ఎల్బీనగర్: ఎల్బీనగర్ ప్రాంతంలో పవిత్రమైన వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత ప్రశాంతంగా, పర్యావరణానికి ఎ ఎలాంటి హాని కలగకుండా జరిగేలా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మన్సూరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణేష్ నిమజ్జన కుంట వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మురికి నీటిలో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదన్న సత్సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మన్సూరాబాద్లో ఈ ప్రత్యేక నీటి కుంటను నిర్మించినట్లు గుర్తుచేశారు. ప్రత్యేక బోర్ల ద్వారా ఎప్పటికప్పుడు కుంటలోకి శుభ్రమైన నీటిని సరఫరా చేయడం వల్ల నిమజ్జన సమయంలో నీరు కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో అనుకూలంగా మారుతోందని తెలిపారు. కేవలం మన్సూరాబాద్లోనే కాకుండా నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక కుంటలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
ప్రతి ఏడాది ఈ కుంటల్లోకి వేలాది సంఖ్యలో గణేశ విగ్రహాలు తరలివచ్చి భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనాలు ముగిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనా కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, తూర్పాటి చిరంజీవి, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.


