షాద్‌నగర్: సాంకేతిక విద్యాశాఖను ‘శక్తి’ పథకంలో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ షాద్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం మరింత ఉధృతమైంది. గత నెల రోజులుగా వివిధ రూపాల్లో కొనసాగుతున్న ఈ నిరసనలో భాగంగా, సోమవారం సుమారు 400 మందికి పైగా విద్యార్థులు షాద్‌నగర్‌లోని ప్రభుత్వ మినీ స్టేడియంలో భారీ ధర్నాకు దిగారు.

“సాంకేతిక విద్యాశాఖ విలీనం దుర్మార్గం.. విలీనం వద్దు.. అభివృద్ధి ముద్దు.. శక్తి స్కీమ్ బహిష్కరణ” అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మినీ స్టేడియం దద్దరిల్లేలా నిరసన వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యా వ్యవస్థను ఇతర పథకాల్లో విలీనం చేయడం వల్ల భవిష్యత్తులో తమ విద్యా ప్రమామాలు, ఉపాధి అవకాశాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యాత్మక అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని సాంకేతిక విద్యాశాఖ విలీన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వయంగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకుని సముచిత పరిష్కారం చూపాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ ధర్నాతో షాద్‌నగర్ మినీ స్టేడియం ప్రాంతంలో తీవ్ర నిరసన వాతావరణం నెలకొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 03:34 PM IST
Tags: