ఆమనగల్లు: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మాదకద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆమనగల్లు పోలీసులు, ఎస్ఓటీ బృందం చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 17,60,000/- విలువ చేసే 35 కిలోల గంజాయి (17 ప్యాకెట్లు), ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 50 వేల ఆశ చూపి...
ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన అభి అనే ప్రధాన గంజాయి డీలర్.. నిందితులైన కుంజం చందు బాబు దొర (ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్), కోసు వెంకట సాయి బాబు దొర (మేస్త్రీ)లకు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఆంధ్ర నుండి తెలంగాణలోని ఆమనగల్లుకు గంజాయిని చేరవేస్తే ఒక్కొక్కరికి రూ. 50,000/- ఇస్తానని ఆశ చూపాడు. డబ్బుకు ఆశపడిన నిందితులు గంజాయి ప్యాకెట్లతో రాజమండ్రి మీదుగా హైదరాబాద్ మార్గంలో ఆమనగల్లు పట్టణానికి చేరుకున్నారు.
మార్కెట్ యార్డులో మాటు వేసి...
నిందితులిద్దరూ మార్కెట్ యార్డుకు చేరుకుని, అక్కడ సరుకును అందుకోవాల్సిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే నమ్మకమైన సమాచారం అందుకున్న ఆమనగల్లు సీఐ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్ఐ సంతోష్ కుమార్ తమ సిబ్బంది, ఎస్ఓటీ బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డులో అనుమానాస్పదంగా ఉన్న నిందితులను చుట్టుముట్టి, వారి వద్ద ఉన్న సరును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఏసీపీ జానకి రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆమనగల్లు పోలీస్ సిబ్బంది ప్రతిభను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన అధికారులకు, సిబ్బందికి త్వరలోనే తగిన రివార్డులు అందజేయనున్నట్లు డీసీపీ తెలిపారు.


