షాద్‌నగర్: దేశం కోసం తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే నిజమైన దేశాభివృద్ధి అనే మహోన్నత “అంత్యోదయ” సిద్ధాంతాన్ని దేశానికి అందించిన గొప్ప జాతీయవాది పండిట్ దీన్ దయాళ్ అని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి, జాతీయత, సామాజిక సమానత్వం మరియు పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన ఆలోచనలు, త్యాగాలు నేటి తరానికి ఎంతో మార్గదర్శకమని అన్నారు. ఏకాత్మ మానవతావాదం ద్వారా భారతీయ జీవన విధానానికి సరిగ్గా సరిపోయే రాజకీయ, సామాజిక ఆలోచనా విధానాన్ని దేశానికి అందించిన మహనీయుడు ఆయనేనని పేర్కొన్నారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపిన మార్గంలో నడుస్తూ, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే ప్రతి బీజేపీ కార్యకర్త ప్రధాన కర్తవ్యమని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు విస్లావత్ మోహన్ సింగ్ నాయక్, సీనియర్ నాయకులు వంశీకృష్ణ, సుధాకర్ అప్ప, కొందుర్గు, కొత్తూరు మండలాల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, అత్తాపురం మహేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, నాయకులు మల్చలం మురళి, రిషికేష్, కృష్ణ యాదవ్, హాజిపల్లి ఉపసర్పంచ్ గంగాధర్, గుడాల రమేష్, మహిళా మోర్చా నాయకురాళ్లు రాజేశ్వరి, లావణ్య, దినేష్ రెడ్డి, గజ్జల ప్రవీణ్, రాజేందర్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 25 Sept 2026 | 05:50 PM IST
Tags: