షాద్నగర్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని షాద్నగర్ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో గోల్కొండ పీఎస్లో అదుపులో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును షాద్నగర్ బీజేపీ ప్రముఖ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎన్ని అరెస్టులు చేసినా, నిర్బంధాలతో భయపెట్టాలని చూసినా బీజేపీ పోరాటాలను ఎప్పటికీ ఆపలేవని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆదేశానుసారం రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుపేద విద్యార్థులకు అందాల్సిన పెండింగ్ ఫీజు బకాయిలను ప్రభుత్వం పూర్తిగా మరియు వెంటనే విడుదల చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రంగా కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
రామచంద్రరావును కలిసి సంఘీభావం తెలిపిన వారిలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్ సింగ్, ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నరసింహ యాదవ్, కొందుర్గు, నందిగామ, కొత్తూరు మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, అరవింద్ చారి, మహేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, సీనియర్ నాయకులు సుధాకరప్ప, హాజీపల్లి ఉపసర్పంచ్ గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, రాజు నాయక్, రాకేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


