హైదరాబాద్: భారీ నిరసనలు, ఆందోళనలు, సంచలన పరిణామాల మధ్య తెలంగాణ శాసనసభ తొలిరోజు సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సమావేశాల తొలిరోజే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఫీజు బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా, ఆందోళనల సమయంలో అరెస్ట్ చేశారు. మరోవైపు, అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్. అన్నింటికంటే ముఖ్యంగా, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ అత్యంత హేయంగా, అవమానకరంగా మాట్లాడారనే అంశం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను అవమానించిన తాతా మధును శాసనసభ నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సభకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. ఇలా పలు కీలక పరిణామాలు, నిరసనల నడుమ తొలిరోజు సభ అట్టుడుకడంతో స్పీకర్ సమావేశాలను వాయిదా వేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 05:47 PM IST
Tags: