షాద్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని, ప్రజాపాలన పేరిట తీవ్ర వంచన జరుగుతోందని ఆరోపిస్తూ షాద్నగర్ పట్టణంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పరిగి రోడ్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. "1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనపై విద్యార్థి యువత చార్జ్ షీట్" అనే భారీ బ్యానర్ను ప్రదర్శిస్తూ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం పరిగి రోడ్ చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన చార్జ్షీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రధాన ఆరోపణలు గుప్పించారు. తొలి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ను 'జాబ్ లెస్ క్యాలెండర్'గా మార్చేశారని మండిపడ్డారు. నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని, విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల హామీ నీటిమూటగానే మిగిలిపోయిందని విమర్శించారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాల హామీని విస్మరించారని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా DSC వేయకుండా నిరుద్యోగులను తీవ్రంగా దగా చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రామ్బల నాయక్ తో పాటు మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల, గ్రామ, మున్సిపాలిటీ వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


