కేశంపేట: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావడం కేశంపేట మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 21 శాఖలకు చెందిన అధికారులు విధిగా హాజరు కావాల్సి ఉండగా.. కేవలం నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలు దాటినా పలువురు ముఖ్య శాఖల అధికారుల జాడ కనీసం కనిపించకపోవడంతో తమ సమస్యల పరిష్కారం కోసం దూరం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురయ్యారు.

తమ గోడును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉదయమే మండల కేంద్రానికి చేరుకున్న ప్రజలు.. అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల రాక కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో బాధ్యులైన అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల సమస్యలను వినాల్సిన అధికారులు నిర్ణీత సమయానికి అందుబాటులో లేకపోతే ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజావాణి రోజున అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని, విధులకు గైర్హాజరయ్యే అధికారులపై శాఖాపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 07:03 PM IST
Tags: