లక్షెట్టిపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ హామీల అమలును కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2న మొదటి రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే నిరసన కార్యక్రమానికి రెండు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, కౌన్సిలర్లు పెట్టెం తిరుపతి, రాందేని జమున, నాయకులు చాంద్ పాష, దండేపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనీల్, నాయకులు చుంచు శ్రీనివాస్, రాజమల్లు, గోళ్ల రవీందర్, శ్రీనివాస్, గరిసె రవీందర్, గడికొప్పుల సతీష్, అక్కల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


