మహేశ్వరం: ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని విలీనం చేసే అంశంపై గులాబీ పార్టీలో భిన్న స్వపాలు వినిపిస్తున్నాయని, అసలు ఈ విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని ఐఎన్‌టీయూసీ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు నడికూడ శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకుల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎత్తిచూపారు.

ఈ నెల 18వ తేదీన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తామే స్వయంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేసినట్లు స్పష్టంగా చెప్పారని శివ గుర్తుచేశారు. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా ఈ నెల 22న జరిగిన మండల స్థాయి సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సర్పంచ్‌లు మాత్రం ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనానికి అనుకూలంగా తాము తీర్మానాలు ఇవ్వబోమని వారు తేల్చిచెప్పడం గమనార్హమన్నారు.

ఒకే పార్టీకి చెందిన అగ్రనేత ఒకలా మాట్లాడటం, క్షేత్రస్థాయి సర్పంచ్‌లు మరోలా వ్యతిరేకించడం వెనుక ఆంతర్యమేంటో మహేశ్వరం మండల ప్రజలు గమనించాలని నడికూడ శివ సూచించారు. రాజకీయ లబ్ధికోసమే బీఆర్‌ఎస్ నాయకులు ఇలా పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చొరవతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లి, మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో భాగం చేసేందుకు పట్టుబట్టి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులు, డేటా సెంటర్లు, ఐటీ హబ్‌లు, లైఫ్‌సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తదితర అతునిక రంగానికి చెందిన పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని శివ వివరించారు. దీనివల్ల మహేశ్వరం ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Sept 2026 | 07:25 PM IST
Tags: