రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెచెరువు సమీపంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. మృతుడు మహమ్మద్ ఖాజా సోహైల్‌కు నిందితులతో గతంలో ఉన్న కక్షలు, గంజాయి విక్రయాల విషయంలో ఏర్పడిన తీవ్ర విభేదాల నేపథ్యంలోనే అతడిని పథకం ప్రకారమే హత్య చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ క్రమంలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి సోహైల్‌తో కలిసి మద్యం సేవించిన అబ్దుల్ రహీమ్, ఇషాక్‌లు ఆ తర్వాత అతడిని ద్విచక్ర వాహనంపై పల్లెచెరువు సమీపంలోని అబ్దుల్ కరీం ట్రేడర్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సయ్యద్ అర్షద్, మహ్మద్ అబ్దుల్ రహీమ్, మహ్మద్ ఇషాక్‌లు ముగ్గురూ కలిసి సోహైల్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం తమపై ఆధారాలు దొరకకుండా హత్యకు ఉపయోగించిన కత్తులు, రక్తపు మరకలున్న దుస్తులను దగ్ధం చేసివేశారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితులు చూపించిన ప్రదేశం నుంచి హత్యకు వాడిన కత్తులను, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే గతంలో 13 కేసులు, మరో నిందితుడిపై 2 కేసులు ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసును త్వరగా చేధించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 09:44 PM IST
Tags: