గన్నేరువరం: ముదిరాజుల ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తగిన సహకారం అందించాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని మల్లయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్థుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముదిరాజ్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్థులు మాట్లాడుతూ.. మానేరు జలాశయంలో కోటి వరకు నాణ్యమైన నర్సరీ చేప పిల్లలు, రొయ్య పిల్లలను వదలాలని కోరారు. ప్రస్తుతం జలాశయంలో కొన్ని రకాల చేపలు మాత్రమే ఉంటున్నాయని, దీనివల్ల తమ వృత్తి లాభదాయకంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తక్కువ సంఖ్యలో చేప పిల్లలను వదలడమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. తగిన మోతాదులో నాణ్యమైన చేప పిల్లలను వదిలిపెట్టడం ద్వారానే ముదిరాజుల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన ముదిరాజ్ కులస్థులకు ప్రభుత్వ పింఛన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు మాట్లాడుతూ.. ముదిరాజులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ సహకారంతో ముదిరాజుల అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ముదిరాజులకు పింఛన్లు, బీమా, టూ-వీలర్ వెహికల్స్ స్కీమ్లను అందించాలని కోరారు. మత్స్యకారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ ఉంటేనే ప్రభుత్వ బీమా వర్తిస్తుందని తెలిపారు.
మండల అధ్యక్షుడు బోయిని మల్లయ్య మాట్లాడుతూ.. మానేరు జలాశయంలో కోటి నాణ్యమైన చేప పిల్లలు పోయించి ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ మాట్లాడుతూ.. ముదిరాజులందరూ సహకరిస్తే జలాశయంలో కోటి చేప పిల్లలు, రొయ్య పిల్లలు పోయించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా కల్పించారు. ప్రభుత్వం కూడా వారు కోరిన సంక్షేమ పథకాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


