సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22ఏ (22A) లో పెట్టలేదని ఆయన మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలో ఆదివారం పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల భూములను ఈ రోజు దాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా, చివరకు ఇందిరా గాంధీ హయాంలో కూడా 22ఏలో పెట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని దళిత, గిరిజనులు, నోరు లేని అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు లక్ష కోట్ల పేదల భూములను 22ఏలో పెట్టి భారీ కుంభకోణానికి తెర లేపారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
లక్ష కోట్ల భూముల పంచాయితీలో పైసలు పంచుకుంటున్న మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ పైసలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటానని అనుకుంటే ముఖ్యమంత్రియే దీనికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. 22ఏలో పేదల భూములను పెట్టొద్దని, అవి తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఆస్తులని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఈసారి జరిగే శాసనసభ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడితే వారికి పూర్తి గౌరవం ఉంటుందని రఘునందన్ రావు సూచించారు.


