కురవి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మారాలని, సబ్బండ వర్గాలకు అన్యాయం చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మద్దతుగా తానే స్వయంగా ఆటో నడిపి నిరసనలో పాల్గొన్నారు. పెద్దతండా గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు దానిని అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికల సమయంలో గొప్ప హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం ద్వారా ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. డ్రైవర్లకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలులో ఇప్పటికే 1000 రోజులు గడిచాయని, ఇక మిగిలింది కేవలం 800 రోజులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మిగిలిన కాలంలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, బోడ శ్రీనివాస్, రాందాస్, సిరి నాయక్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 05:28 PM IST
Tags: