వనస్థలిపురం: పాదచారుల నడకకు కూడా స్థలం లేకుండా రోడ్లను ఆక్రమిస్తున్న అక్రమ కబ్జాలపై అధికారులు ఎట్టకేలకు కఠిన చర్యలు చేపట్టారు. వనస్థలిపురంలోని ప్రధాన రహదారి అయిన పోస్టాఫీస్ నుంచి గురుద్వారా మీదుగా రైతు బజార్ వరకు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను అధికారులు శనివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హయత్ నగర్ సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు అత్యంత పకడ్బందీగా చేపట్టారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి, టీపీవో సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూల్చివేతలు నిర్వహించారు.
వనస్థలిపురం పోస్టాఫీస్ నుంచి రైతు బజార్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న టీ బండ్లు, ఫ్రూట్ షాపులు, ఐస్క్రీమ్ షాపులు, హోటళ్ల ముందు అదనంగా వేసుకున్న షెడ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఆక్రమణలు దాదాపు 50 నుంచి 60 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా పాదచారుల మార్గాన్ని ఆక్రమించిన వీటన్నింటినీ అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరుతున్న జనం
వనస్థలిపురం మెయిన్ రోడ్డు నిత్యం వేలాది వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఫుట్పాత్లు పూర్తిగా వ్యాపార ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి నెలకొంది. దీనివల్ల నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు సైతం పెరిగిపోయాయి. స్థానికులు, ప్రయాణికుల నుంచి వస్తున్న నిరంతర ఫిర్యాదులతో స్పందించిన అధికారులు ఈసారి వెనక్కి తగ్గకుండా కఠినంగా వ్యవహరించారు.
అయితే, ఇలా తొలగించిన కొద్ది రోజులకే మళ్లీ యథావిధిగా ఆక్రమణలు మొదలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, పునరాక్రమణలకు పాల్పడే వారిపై భారీగా జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత అక్రమణల తొలగింపుతో పాదచారులకు, వాహనదారులకు కొంతమేర ఊరట లభించినట్లయింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ చైన్మెన్లు చంద్రయ్య, తిరుమలేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


