షాద్నగర్: షాద్నగర్ పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో లాటరీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి, క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేపట్టి నిజమైన అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా నాయకులు ఎన్. రాజు, పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ.. గత 2004-2006 సంవత్సరాల నుంచే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పలుమార్లు అధికారులకు, ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు.
గతంలో రూపొందించిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి, నేడు పట్టణంలో కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ అనుచరులకు మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం ఏంటని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఫోర్ వీలర్లు, మోటార్ వాహనాలు ఉన్నవారిని, ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారిని అర్హుల జాబితాలో ఎలా చేరుస్తారని నిలదీశారు.
నిజమైన అర్హులైన పేదలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయపోరాటంగా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తక్షణమే అర్హులకు ఇళ్లు కేటాయించనిచో త్వరలోనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఈశ్వర్ నాయక్, నాయకులు కావాలి రాజు, లక్ష్మి, పార్వతమ్మ, పారిజాత, మీనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.


