గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు. కాశీంపేట గ్రామంలో ఈజీఎస్ (EGS) నిధులు రూ. 10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే, అర్హులైన మహిళలకు ఉపాధి కల్పించేలా కుట్టు మిషన్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.

అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం కొత్తగా నియామకమైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో గన్నేరువరం మండలంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారని, రుణమాఫీ చేయలేదని, దళిత బంధు రాలేదని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, 2 లక్షల రుణమాఫీ, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గన్నేరువరం మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీస్, పోలీస్ స్టేషన్ వంటి ప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణాలు చేపడతామని హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు జువాడి మన్మోహన్రావు, కొమ్మెర రవీందర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ నాయకులు మాతంగి అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, విజయేందర్, పాకాల పరశురాములు, కూన చంద్రశేఖర్, నవీన్, రేపాక బాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 10:15 PM IST
Tags: