హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కళ్ల ముందే ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆక్షేపించారు. రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే నేడు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయని, కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా అని నిలదీశారు. పోలీసులను ప్రయోగించి రైతులను భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి, తెలంగాణకు జలద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా అని ప్రశ్నించారు. సాగునీరు, కరెంట్ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా అని మండిపడ్డారు. ఇది ప్రజాపాలనా లేక ప్రజా పీడననా అని నిలదీసిన హరీశ్ రావు.. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Oct 2026 | 02:29 PM IST
Tags: