యాదాద్రి భువనగిరి: తాను సబ్‌స్టేషన్ సందర్శనకు వస్తున్నాననే సమాచారంతోనే అధికారులు రికార్డులు, లాగ్ బుక్స్ మాయం చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. మోటకొండూర్ మండలంలో పర్యటించిన ఆయన, అందులో భాగంగా స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం మరియు సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ఎప్పుడైనా సబ్‌స్టేషన్‌లో లాగ్‌ బుక్స్ ఉండాలని, ఎప్పుడు కరెంట్ వచ్చింది, ఎప్పుడు 3 ఫేజ్‌ కరెంట్‌ తీసేశారు, మధ్యలో ఎన్నిసార్లు ట్రిప్‌ అయ్యింది, రైతులకు అసలు ఎన్ని గంటల పాటు నిరంతరం 3 ఫేజ్‌ కరెంట్ ఇచ్చారనేది లాగ్‌ బుక్స్‌లో నమోదు చేయడం విద్యుత్ ఉద్యోగుల ఆనవాయితీ అని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో స్వయంగా పరిశీలిద్దామని సబ్‌స్టేషన్‌కు వస్తే, లాగ్ బుక్స్‌ను మాయం చేయడం దేనికి సంకేతమని నిలదీశారు. మోటకొండూర్ ప్రాంతంలో రైతులకు కనీసం 6-7 గంటలు కూడా కరెంట్ సరిగ్గా రావడంలేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు స్వయంగా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం తమ పొలాల వద్దకు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా వెళ్లి పరిశీలిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే, లీగల్‌గా కొనుక్కున్న తమ ఆస్తుల వద్దకు వెళ్తే ఒరిగేదేమి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్‌ రావు హెచ్చరిక జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 20 Sept 2026 | 07:32 PM IST
Tags: