వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత, భయాందోళనలు సృష్టించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో పాల వ్యాపారిపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు.
గుర్రంగూడకు చెందిన భుజంగరావు (60) పాల వ్యాపారం చేస్తుండగా.. ఆయన ఇంటి పక్కనే స్టేషనరీ షాపు నిర్వహించే శివేందర్ సింగ్తో గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భుజంగరావు యాక్టివాపై పాలు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో కాపుకాసిన శివేందర్ సింగ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భుజంగరావును స్థానికులు, పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మార్గమధ్యలో మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. దాడి అనంతరం నిందితుడు శివేందర్ సింగ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.


