మహేశ్వరం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం 'వీబీజి-రాంజీ' గ్రామ సభ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ఎన్. శారదమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీడీవో, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

inline-img

గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ..

అనంతరం నిర్వహించిన గ్రామ సభలో మహేశ్వరం గ్రామ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రజలతో కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ ప్రజలకు అత్యవసరమైన అభివృద్ధి పనులను వీబీజి-రాంజీ నిధుల ద్వారా చేపట్టేందుకు ప్రాధాన్యతా క్రమంలో పనులను గుర్తించారు.

గ్రామ ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలు, వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని గ్రామ సభలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

inline-img

ఈ సందర్భంగా ఎంపీడీవో ఎన్. శారదమ్మ, సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన గ్రామ స్వరాజ్యం, పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో మహేశ్వరం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా మారుస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 08:10 PM IST
Tags: