కడ్తాల్: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్, మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కె. నారాయణ రెడ్డి కడ్తాల్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణతో పాటు రికార్డులను, కేస్ డైరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగా చూడాలని, వారి సమస్యలను మర్యాదపూర్వకంగా శ్రద్ధగా వినాలని డీసీపీ సూచించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం బాధితులకు వేగంగా న్యాయం చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలని సిబ్బందికి హితవు పలికారు.
అనంతరం సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ఉద్యోగాలు, పెట్టుబడులు, నకిలీ లోన్ యాప్లు, ఓటీపీ మోసాలు, అనుమానాస్పద లింకుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, పిన్, ఓటీపీలు చెప్పవద్దని గ్రామాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే తక్షణమే స్పందించాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకీ రెడ్డి, కడ్తాల్ ఇన్స్పెక్టర్ వి. సైదీ రెడ్డి, ఎస్ఐలు ఎం. రవీందర్, బి. చంద్రశేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


