కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పొగాకు సంధ్య వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి నిర్వహించిన భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పూజలు జరిపారు. ఆలయ పునర్నిర్మాణం ద్వారా గ్రామానికి అంతా శుభం కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.


