హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ మహమ్మద్-2026' పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రజా సంక్షేమం, పాలనా దక్షతను గుర్తించిన నిర్వాహకులు ఈ ఏడాదికి గాను 'బెస్ట్ పబ్లిక్ సర్వెంట్' అవార్డును ఆయనకు ప్రకటించారు. శుక్రవారం కేరళలోని నిలంబూరులో అత్యంత ఘనంగా జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని స్వయంగా అందుకోనున్నారు.

రేవంత్ రెడ్డి పాలనా కాలంలో రైతులు, బీసీలు, సమాజంలోని సామాన్య పౌరుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మక పథకాలను జ్యూరీ ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ప్రజాస్వామిక విలువలపై సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న నిబద్ధతను, ప్రజల సంక్షేసమే ధ్యేయంగా సాగుతున్న ఆయన పాలనా శైలిని ఈ సందర్భంగా అవార్డు జ్యూరీ అభినందించింది.

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమ్మద్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆర్యదాన్ మహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించనున్నారు. జాతీయ స్థాయిలో సీఎం రేవంత్ పాలనకు లభిస్తున్న ఈ గుర్తింపు పట్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 24 Sept 2026 | 07:43 PM IST
Tags: