ఉపాధి డెస్క్: డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) ఒక చక్కటి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 225 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరలిస్ట్ పోస్టులు 200 ఉండగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హిందీ ఆఫీసర్ పోస్టులు 25 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.82,485 నుంచి గరిష్టంగా రూ.1,56,745 వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు బేసిక్ పేతో పాటు ఎన్‌పీఎస్, గ్రాట్యూటీ, ఎల్‌టీఎస్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ప్రత్యేక వైద్య సదుపాయాలు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

జనరలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, డేటా సైన్స్ తదితర విభాదాల అభ్యర్థులు దీనికి అర్హులు. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే హిందీ ఆఫీసర్ పోస్టుల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో హిందీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. మరోవైపు ఇంగ్లిష్ మీడియంలో మాస్టర్స్ డిగ్రీ చేసి, హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా అభ్యసించిన వారు కూడా అర్హులే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఇక్కడ కూడా 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే, 2026 జూన్ 30 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే 1996 జూన్ 30 నుంచి 2005 జూన్ 30 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ పరీక్షలు, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారిని ప్రధాన పరీక్ష అయిన మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను చివరిగా ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉండగా, మిగిలిన ఇతర అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు యూఐఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి. అందులో సూచించిన విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. చివరగా నిర్ణయించిన దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 28, 2026గా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 22, 2026న నిర్వహించనుండగా, మెయిన్స్ పరీక్ష నవంబర్ 30, 2026న జరగనుంది. అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తేలిపారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 20 Sept 2026 | 08:32 PM IST
Tags: