కొత్తూర్: రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల పరిధిలోని చారిత్రాత్మక, ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ జహంగీర్ పీర్ దర్గాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గురువారం సందర్శించి దర్శించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులతో కలిసి దర్గాకు చేరుకున్న ఆయన.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా సేవకుల వద్ద ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పరిశీలనకు తరలింపు..
దర్గా సందర్శన అనంతరం స్థానిక సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వివాదానికి సంబంధించిన బాధితులు, ఉద్యమకారుల దరఖాస్తును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ స్వీకరించారు. అక్కడి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, సమస్యలను స్వయంగా గ్రహించేందుకు ఆయన నేరుగా సిద్ధాపూర్ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు అందే బాబయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ప్రముఖ గిరిజన నాయకులు రాంబల్ నాయక్, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు ఉద్యమకారుడు ఎమ్మే సత్యనారాయణ, మిట్టు నాయక్, దేవేందర్ యాదవ్, రాజు నాయక్ తదితరులు పాల్గొని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి ఘన స్వాగతం పలికారు.


