వనస్థలిపురం: హిందూ దేవుళ్లపై జరిగిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వనస్థలిపురంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షులు గంగం ప్రేమ్ నాథ్ ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ చౌరస్తా వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్.బి. నగర్ అసెంబ్లీ ఇంచార్జ్, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారీ సామ రంగారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. హిందువుల విశ్వాసాలను, మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలపై హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే తీవ్ర స్థాయిలో ప్రజా ఆగ్రహం ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


