గన్నేరువరం: ఇటీవలే అత్యంత వైభవంగా ప్రారంభమైన కరీంనగర్ - గన్నేరువరం - బెజ్జంకి మీదుగా సికింద్రాబాద్ వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసు ఇప్పుడు ‘మూణ్నాళ్ల ముచ్చట’గా మారింది. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు హడావుడిగా ప్రారంభించిన ఈ బస్సు సర్వీసు, ప్రారంభించిన కొద్ది రోజులకే నిలిచిపోవడంపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా సికింద్రాబాద్ వెళ్లే ఈ బస్సు గన్నేరువరం, బెజ్జంకి రూట్‌లో రాకపోకలు సాగించకపోవడంతో నిత్యం హైదరాబాద్, సికింద్రాబాద్ వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రూటులోని గ్రామాల ప్రజలు బస్సు కోసం గంటల తరబడి బస్ స్టాండ్లలో నిరీక్షించి, చివరకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రాంతీయ అవసరాలను తీరుస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుండి రాజధానికి నేరుగా రవాణా సౌకర్యం అందుతుందని భావించిన ప్రజలకు ఈ సర్వీసు నిలిచిపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రజాప్రతినిధులు కేవలం రిబ్బన్ కటింగ్ వేడుకలకు, పబ్లిసిటీకే పరిమితమవుతున్నారని, ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రారంభోత్సవాల తర్వాత బస్సుల నిర్వహణను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

సాంకేతిక కారణాల వల్ల లేదా రూట్ సమస్యల వల్ల బస్సు నిలిపివేశారా? లేక శాశ్వతంగా రద్దు చేశారా? అని అధికారులు స్పష్టం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నిలిచిపోయిన కరీంనగర్ - సికింద్రాబాద్ బస్సు సర్వీసును యథావిధిగా నడిపించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై కరీంనగర్ బస్టాండ్ ఎంక్వైరీ నెంబర్ (9959225931) కు ఫోన్ చేసి వివరణ కోరగా, ప్రస్తుతం సికింద్రాబాద్ - గన్నేరువరం బస్ సర్వీస్ నడవడం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Oct 2026 | 10:19 PM IST
Tags: