మహేశ్వరం: మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను పురపాలక, రెవెన్యూ అధికారులు బుధవారం భారీ బందోబస్తు మధ్య చేపట్టారు. తుక్కుగూడ పరిధిలో రహదారికి ఇరువైపులా ఉన్న తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తుండటంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమ నిర్మాణాలను ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులతో మాట్లాడి సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ కూల్చివేతల ప్రభావం రహదారి రాకపోకలపై పడటంతో శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా మందగించాయి. హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

inline-img

ఈ భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా అత్యవసర పనులపై వెళ్లే వాహనదారులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోజువారీ ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు కొనసాగుతున్న దృష్ట్యా, ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:24 PM IST
Tags: