మహేశ్వరం: ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో అత్యంత కీలకమైన 330 ఫీట్ రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రేడియల్ రోడ్డు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్) క్షేత్రస్థాయిలో పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పురోగతిని తెలుసుకుని, సీఎం పర్యటనకు సంబంధించి పలు సలహాలు, సూచనలు అందించారు.

inline-img

ఈ సందర్భంగా కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ సమగ్ర అభివృద్ధిలో ఈ 330 ఫీట్ రేడియల్ రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు. ఈ రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, భారీ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పరిశ్రమల రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విశేషంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని, ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా రవాణా చేసుకోవడానికి ఈ రోడ్డు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతో మహేశ్వరం ప్రాంత స్వరూపమే మారిపోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వట్టేలా మల్లేష్ యాదవ్, చిన్నతుప్ర సర్పంచ్ రాజు గొల్లూరి, మాన్షన్‌పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల శ్రీశైలం, నాయకులు గణేష్, జగన్‌లతో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:19 PM IST
Tags: