యాచారం: ఎంతో దూరదృష్టితో హైదరాబాద్‌కు ధీటైన మహానగరాన్ని నిర్మిస్తుంటే.. దాన్ని రద్దు చేసి, మళ్లీ ఫార్మా తెస్తామని కొందరు దివాళాకోరు రాజకీయాలు మాట్లాడుతున్నారని, ముందు అటువంటి వారి పార్టీలకే రాజకీయంగా అడ్రస్ ఉండదని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఫార్మా పేరుతో కేవలం భూదందాలు చేయడం, పేదల పరిహారాన్ని కాజేయడం తప్పిస్తే గతంలో యాచారం మండలానికి బీఆర్ఎస్ నాయకులు చేసిందేం లేదని ఆయన మండిపడ్డారు.

బుధవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం, మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత పర్యటన చేపట్టారు. యాచారం, మొండిగౌరెల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, ధర్మన్నగూడ తదితర గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే మల్‌‌రెడ్డి రంగారెడ్డి.. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రభుత్వ పాఠశాలలో నూతన అదనపు గదుల నిర్మాణాలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు లాంఛనంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రగతి బాటలు వేసేందుకు విచ్చేసిన తమ ప్రియమైన ఎమ్మెల్యేకు యాచారం, మొండిగౌరెల్లి గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

కొత్తపల్లిలో మౌలిక వసతుల కల్పన..

కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఆగిపోయిన ఈ గ్రామం రూపురేఖలు ఇక పూర్తిగా మారనున్నాయని తెలిపారు. ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన ప్రతి ఒక్క సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియలో నష్టపోయిన ప్రతీఒక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అసైన్డ్ భూములు కోల్పోయిన రైతన్నలకు కూడా మార్కెట్ ధర ప్రకారం తగిన పరిహారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు.

ధర్మన్నగూడ రోడ్డు సమస్యపై తక్షణ స్పందన..

దశాబ్దాలుగా ధర్మన్నగూడ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, గత పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని గ్రామస్థులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.. తక్షణమే స్పందించి రాబోయే కాలంలో గ్రామానికి పక్కా రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే యాచారం మండలానికి భారీ ఎత్తున నిధులను కేటాయించి, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Sept 2026 | 09:44 PM IST
Tags: