యాచారం: గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ, బెల్టు షాపుల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని, యాచారం మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మండలరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలలో పర్యటించి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా సహించేది లేదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మరియు ఇతర సంక్షేమ పథకాలను ఎలాంటి సిఫారసులు లేకుండా అర్హులైన పేదలందరికీ పారదర్శకంగా అందించాలని ఆదేశించారు. మండల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల నిధులను మంజూరు చేస్తామని, అసైన్డ్ భూములు కోల్పోయిన నిజమైన రైతులకు పూర్తి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

గ్రామాలలో యువత రోజురోజుకు మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు బానిసలై కుటుంబాలకు తీరని భారంగా మారుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో బెల్టు షాపులు వద్దని స్థానిక సర్పంచులు తీర్మానం చేస్తే, వాటిని వెంటనే పూర్తిగా తొలగించాలని ఎక్సైజ్ సీఐ సురేంద్ర వర్మను ఆయన కఠినంగా ఆదేశించారు.

రూ.6.70 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం..

సమీక్ష సమావేశం అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో సుమారు రూ. 6 కోట్ల 70 లక్షల భారీ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఎంపీడీవో రాధారాణి, ఎమ్మార్వో అయ్యప్ప, సర్పంచులు మస్కు అనిత శరణం, అశోక్ యాదవ్, డేరంగుల శంకర్, విజయ్ నాయక్, అరవింద్ నాయక్, బుచ్చిరెడ్డి, ముచ్చర్ల సుగుణ సంపత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 30 Sept 2026 | 09:38 PM IST
Tags: